ఎన్డీయేలో కీలక పాత్ర పోషించినా ఫాయిదా ఏదీ
విజయవాడ : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రత్యేక హోదాపై ఊసే లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనికరం కలగలేదని వాపోయారు. కడప స్టీల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటూ మండిపడ్డారు. మెట్రో రైలు ప్రస్తావన లేక పోవడం దారుణమన్నారు. మెట్రో కారిడార్ల సంగతి తేల్చక పోవడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిలా రెడ్డి. పట్టుమని 10 పైసల మందం కూడా బడ్జెట్ తో ప్రయోజనం లేదంటూ ఫైర్ అయ్యారు.
ఢిల్లీ తలదన్నే రాజధాని కడతామని అప్పులు అంటగట్టడం దుర్మార్గం అన్నారు. లక్ష కోట్లు ఖర్చయ్యే అమరావతికి ADB, జపాన్ బ్యాంకుల నుంచి 15 వందల కోట్లు అప్పులిప్పిస్తే రాజధాని పూర్తవుతుందా ? గతేడాది అప్పుల కింద ఇస్తామని చెప్పిన 15 వేల కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా ? గ్యారెంటీ కింద అప్పులు అంటే..ఎవరికి గ్యారెంటీ ? విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణం కేంద్రానిదే బాధ్యత అని తెలియదా ? అని నిలదీశారు అప్పులు ఇస్తామని చెప్తే ఆంధ్రుల ఆత్మగౌరవం ఎప్పడు పూర్తవుతుంది ? ఇదేనా బీజేపీ కి రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధి అంటూ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు.






