మాజీ మంత్రి కుటుంబానికి భద్రత కల్పించండి
అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆపై ఆయన ఇంటికి, కారుకు నిప్పంటించారు. అంతే కాకుండా ఆఫీసును ధ్వంసం చేశారు. ఫర్నీచర్ ను చిందర వందర చేసి పనికి రాకుండా చేసేశారు. ఆయన కుటుంబీకులను భయభ్రాంతులకు గురి చేశారు.
దీనిపై తీవ్ర ఆవేదన చెందారు మాజీ మంత్రి అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి. తాము ఏపీ కూటమి సర్కార్ హయాంలో బతికే పరిస్థితులు లేవంటూ వాపోయారు. తమ ఇంటి మీద విచక్షణా రహితంగా దాడి చేశారని, తన భర్తను చంపేందుకు ప్రయత్నం చేశారంటూ పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సీరియస్ అయ్యింది. అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటల భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేవరకు భద్రత ఇవ్వాలని స్పష్టం చేసింది.






