విద్య, వైద్యం ఉచితంగా ప్రజలకు ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ : దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఎల్.బి. నగర్‌లో వెల్‍నాక్స్ రీహాబిలిటేషన్ నాలుగో కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వైద్య నిపుణులతో ముచ్చటించారు. రీహాబిలిటేషన్ అనే ముఖ్యమైన సామాజిక అవసరాన్ని గుర్తించి రోబోటిక్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ స్వాతిని ప్రత్యేకంగా అభినందించారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
వైద్యం, వైద్యసేవలు ఒక ‘మిషన్’లా సాగాలని స్పష్టం చేశారు. సర్జరీ తర్వాత రోగి తన సొంత కాళ్లపై నిలబడేలా చేసే ‘గోల్డెన్ విండో’ పీరియడ్‌లో రీహాబిలిటేషన్ పాత్ర కీలకం అన్నారు. దురదృష్టవశాత్తూ దేశంలో ఏటా లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్న తరుణంలో, ఇలాంటి అత్యాధునిక కేంద్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య నాయుడు. బీమా సంస్థలు కూడా రీహాబిలిటేషన్‌ను పూర్తి స్థాయిలో బీమా పరిధిలోకి తీసుకువచ్చి రోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ఉప రాష్ట్రపతి.





