ఘనంగా ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 28వ తేదిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు .వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.
ఉత్సవాలలో భాగంగా మే1వ తేదీన ఉదయం ధ్వజారోహణం ( మేషలగ్నంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు) , రాత్రి పెద్దశేష వాహనం, 2వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం , రాత్రి హంస వాహనం, 3వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 4వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం, 5వ తేదీన ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 6వ తేదీన ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం, 7న ఉదయం సూర్యప్రభ వాహనం. రాత్రి చంద్రప్రభ వాహనం, 8న ఉదయం రథోత్సవం ( ఉదయం 6 నుండి 10.30 గంటల వరకు)
సాయంత్రం – ఆర్జిత కల్యాణోత్సవం ( సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు), రాత్రి అశ్వ వాహనం, 9వ తేదీన ఉదయం చక్రస్నానం (ఉదయం 11.30 నుండి 11.45 గంటల వరకు), రాత్రి ధ్వజావరోహణం ( రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు) జరగనున్నాయని తెలిపింది టీటీడీ.
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 8వ తేదీన సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.






