నిర్వీర్యం చేసిన తిరుపతి పోలీసులు
తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు సారధ్యం లోని పోలీసులు దూకుడు పెంచారు. జిల్లాలో భారీ గంజాయి స్కాంను బట్ట బయలు చేశారు. ఈ సంఘటన జిల్లాలోని రేణిగుంటలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే రేణిగుంటలో రూ. 20 కోట్ల విలువైన 4,100 కిలోల గంజాయిని నిర్వీర్యం చేశారు తిరుపతి పోలీసులు. ఈ సందర్బంగా స్పందించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తిరుపతి పోలీసు యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు .
ఎస్పీ సుబ్బారాయుడు , కలెక్టర్ వెంకటేశ్వర్లు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమర్థవంతమైన చర్య, మాదకద్రవ్యాల పట్ల మా ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో తెలియ జేస్తోందని అన్నారు హోం శాఖ మంత్రి. డ్రగ్స్ మాఫియాకు ఇది నా హెచ్చరిక – చట్టం పంజా నుంచి మీరు తప్పించు కోవడం అసాధ్యం అని అన్నారు. ఇకపై రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నెట్వర్క్ను మూలలతో సహా పెకిలించి వేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.
మన యువత బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం సాగిస్తున్న ఈ పోరాటం నిరంతరం కొనసాగు తుందన్నారు. ‘డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు వంగలపూడి అనిత.






