కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
సింగపూర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి సింగపూర్ దేశం అనుసరిస్తున్న సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. మంత్రి పొంగూరు నారాయణతో కలిసి అచ్చెన్నాయుడు సింగపూర్ లో పర్యటించారు. ఈ సందర్బంగా సింగపూర్‌లో నిర్వహిస్తున్న వారం రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి గన్ సియో హువాంగ్‌తో సమావేశం అయ్యారు.
భారత్ – సింగపూర్ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక శక్తి, టెక్నాలజీ రంగాల్లో సింగపూర్ నైపుణ్యాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి ఎలా వినియోగించు కోవాలనే అంశాలపై సానుకూల చర్చలు జరిగాయని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అంతర్జాతీయ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపేందుకు కృషి చేస్తున్నాం అన్నారు.





