newsseals.com
News

టీచ‌ర్లు లెర్నింగ్ ఫెసిలిటేట‌ర్స్ గా మారాలి

VijayaBhaskar May 4, 2026
newsseals=APGovt
Spread the love

ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్

అమ‌రావ‌తి : ఉపాధ్యాయులు కేవలం సమాచారాన్ని అందించే వారుగా కాకుండా, పిల్లల్లో ఆలోచనలను ప్రేరేపించే ‘లెర్నింగ్ ఫెసిలిటేటర్స్’గా మారాలని లోకేష్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొలుత సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (NIE) లో మే 8, 2026 వరకు జరుగుతున్న ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమం ఒక మైలురాయి. “డిజైనింగ్ లెర్నింగ్, ఇన్‌స్పైరింగ్ థింకింగ్” అనే నినాదంతో సాగుతున్న ఈ పర్యటనలో 37 మంది ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

బృందంలో కేవలం ఒక విభాగానికే పరిమితం కాకుండా, విద్యా వ్యవస్థలోని అన్ని స్థాయిలకు ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోంది. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు, రాజకీయాలకు తావు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా 10 మంది హెడ్ మాస్టర్లు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, 4 గురు ప్రిన్సిపాల్స్, 5 గురు ఫిజికల్ డైరెక్టర్లను విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఈ పర్యటనకు ఎంపిక చేశారు. వీరిలో 17 మంది మహిళలు ఉండటం కొసమెరుపు.

ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ‘అనిశ్చిత కాలంలో విద్య – ఎదుర్కొంటున్న సవాళ్లు’, సింగపూర్ విద్యా విధానంపై అవగాహన, బోధనా ప్రణాళిక రూపకల్పన యిషున్ సెకండరీ స్కూల్ సందర్శన, విశ్లేషణాత్మక ఆలోచన ,బోధనపై చర్చ, అధ్యాపకులకు అవసరమైన సమన్వయ నైపుణ్యాల పై అవగాహన, ఆంధ్రప్రదేశ్‌లోని తరగతి గదులను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం, అర్థవంతమైన అభ్యసన రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.