
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మోషన్ రాజు
అమరావతి : ప్రభుత్వం నియమించిన ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్ పర్సన్ కొయ్యే మోషణ్ రాజు . శనివారం అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో చైర్మన్లు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాలలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని చర్చించి పరిష్కార మార్గాలను సూచించాలని చెప్పారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలలో కూడా పర్యటనలు చేపట్టాలని తెలిపారు. ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్టసభలకు ఒక ఆయువుపట్టు లాంటిదని అన్నారు స్పీకర్.
సభా సమావేశాలు సంవత్సరం పొడవునా జరపటం సాధ్యం కాని పని అన్నారు అయ్యన్న పాత్రుడు. ఈ కమిటీలు సభ పని బారాన్ని పంచుకుంటాయని తెలిపారు. సంవత్సరం పొడవునా పని చేస్తాయన్నారు. ఈ కమిటీలన్నీ శాసనసభ , మండలి లోని ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో కీలకంగా ఉంటాయని అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు వంటి వర్గాల సంక్షేమానికి మనం తీసుకొనే చర్యలు నైతిక బాధ్యత మాత్రమే కాదు రాజ్యాంగబద్ధమైన విధి అని పేర్కొన్నారు. అదేవిధంగా వెనుకబడిన, అసూచిత, మైనారిటీ వర్గాల అభివృద్ధి లో ,వీరి సమస్యలు పరిస్కారించటంలో ఈ కమిటీల ప్రాధాన్యత అపారమైనదని అన్నారు. కమిటీల ఏర్పాటుతో ప్రజల సమస్యలు మరింత సమర్థవంతంగా చర్చించ బడతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య స్థిరత్వానికి తోడ్పడతాయని స్పీకర్ అన్నారు.