టీటీడీకి ఈవోగా రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు
అమరావతి : ఏపీ సర్కార్ ఏరికోరి ఎందుకు సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించిందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఏపీ సీఎంగా కొలువు తీరిన సమయంలో తనను ఈవోగా అపాయింట్ చేశారు. ఆ తర్వాత జగన్ సర్కార్ వచ్చాక తనను మార్చేశారు. అయినా ఎక్కడ, ఏ పదవి ఇచ్చినా అనిల్ కుమార్ సింఘాల్ ఆ పదవులకు న్యాయం చేసేలా కృషి చేశారు. ప్రధానంగా ఎలాంటి అవినీతి మరకలు అంటని వ్యక్తి. తను తొలిసారిగా ఈవోగా కొలువు తీరిన సమయంలో గాడి తప్పిన టీటీడీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేశారు. అంతే కాదు జవాబుదారీతనం ఉండేలా చూశారు. తను ఏపీకి చెందిన 1993 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్.
అంతకు ముందు ఉమ్మడి ఏపీలో గద్వాలలో అనిల్ కుమార్ సింఘాల్ 1995లో సబ్ కలెక్టర్ గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆరోగ్య శాఖ, ఫైనాన్స్ శాఖ, విజయవాడ, విశాఖపట్నం కలెక్టర్ వంటి కీలక పదవుల్లో కూడా పనిచేశారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముఖ్య పాత్ర పోషించారు. విచిత్రం ఏమిటంటే తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఎవరికీ దక్కని అవకాశం అనిల్ కుమార్ సింఘాల్ కు దక్కబోతోంది. ఇప్పటి వరకు ఈవోగా పని చేసిన వారికి రెండుసార్లు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ సీఎం తన పనితీరును ఆధారంగా మరోసారి పని చేసేందుకు అవకాశం దక్కేలా చేశారు. ఈనెల 10వ తేదీన టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా బాధ్యతలు స్వీకరించ బోతున్నారు. ఆయన గతంలో ఈవోగా మే 1, 2017 నుండి అక్టోబర్ 4, 2020 దాకా విధులు నిర్వహించారు.







