తిరుమలలోని దుకాణాదారులకు ఏఈవో ఆదేశం
తిరుమల : తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.
అదే విధంగా తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు వెంకయ్య చౌదరి. దాతలతో తిరుమలలోని ఉద్యానవనాలను సుందరీకరించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య విభాగం, ఎఫ్ ఎం ఎస్ సేవలు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్ఈడి బోర్డులు, శ్రీ వారి సేవ, వైద్య, ఐటీ, కళ్యాణ కట్ట విభాగాల పనితీరు, తదితర అంశాలను కూడా సమీక్షించారు. ఇదే సమయంలో భక్తుల నుంచి వచ్చే సూచనలు, సలహాలను స్వీకరించాలని పేర్కొన్నారు.







