నూతన విధానానికి శ్రీకారం చుట్టిన టీటీడీ
తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుండి అభిప్రాయాలను సేకరించే విధానానికి శ్రీకారం చుట్టారు. తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారు. ఇందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియ జేయవచ్చు. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వే ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది.
ప్రతినెలా మొదటి శుక్రవారం టీటీడీ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవో స్వయంగా భక్తులతో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇందుకు భక్తులు 0877-2263261 కు కాల్ చేసి తమ అభిప్రాయాలను టీటీడీ ఈవోకు నేరుగా తెలుపవచ్చు. టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా కూడా భక్తులు తమ అభిప్రాయాలను తెలియ జేయాలని కోరారు. వివిధ మాధ్యమాల ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అధిక సంఖ్యలో భక్తులకు ఉపయోగపడేలా సేవలను మరింత నాణ్యంగా అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది.






