యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని కితాబు
ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రశంసలు కురిపించారు. SDAT స్క్వాష్ ప్రపంచ కప్ 2025లో చరిత్ర సృష్టించి, తమ మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది భారత స్క్వాష్ జట్టు. ఈ సందర్బంగా సోమవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభినందించారు. జోష్నా చినప్ప, అభయ్ సింగ్, వేలవన్ సెంథిల్ కుమార్, అనహత్ సింగ్ అద్భుతమైన అంకితభావాన్ని, పట్టుదలను ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మీరు సాధించిన విజయం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ఈ విజయం మన యువతలో స్క్వాష్ క్రీడకు ప్రజాదరణను కూడా పెంచుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తోందని స్పస్టం చేశారు. ఇప్పటికే అన్ని క్రీడా రంగాలకు అత్యధికంగా బడ్జెట్ ను కేటాయించామన్నారు నరేంద్ర మోదీ. తాము చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలు వచ్చేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే భారత మహిళా క్రికెట్ జట్టు 25 ఏళ్ల సుదీర్ఘ అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ 2025ను కైవసం చేసుకుందని తెలిపారు. భారతీయ అమ్మాయిలు సాధించిన విజయం అద్బుతమైని, అపూర్వమని ప్రశంసలు కురిపించారు.








