newsseals.com
News

సింగరేణి స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి : కేటీఆర్

VijayaBhaskar January 27, 2026
newsseals-KTR
Spread the love

డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వ‌ర్కంగ్ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ : తెలంగాణ కొంగు బంగారంగా వినుతికెక్కిన సింగ‌రేణి ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై విచార‌ణ జ‌రిపించాల‌ని , దోషులు ఎవ‌రో తేల్చాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు , ఇతర నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో టెండర్లు, కొనుగోళ్లు, విధానాలు , సీఎస్ఆర్ సంబంధిత అవకతవకలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ ప్రతినిధి బృందం గవర్నర్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.

నైని కోల్ బ్లాక్ కేటాయింపులో జరిగిన అవకతవకలు మరియు SCCL యొక్క సీఎస్ఆర్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు , అనుబంధ పత్రాలను గవర్నర్‌కు సమర్పించారు.
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి కాబట్టి, దానిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాల‌ని విన్న‌వించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ఓ వైపు రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ గాడి త‌ప్పితే మ‌రో వైపు దావోస్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్.