భారీ ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నృసింహ స్వామి జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహ స్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహ స్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు.
స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామి వారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు పాల్గొన్నారు.







