Friday, 16 October 2026

చేనేత రంగ అభివృద్ధికి పెద్దపీట

newsseals-Savitha

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎస్. స‌విత

అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేస్తోందన్నారు. దీనిలో భాగంగా, గత నెల ఒకటో తేదీ నుంచి చేనేతలకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింద‌న్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందజేస్తోందన్నారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు కేటాయిస్తోందన్నారు. ముద్ర రుణాలు ఇస్తున్న‌ట్లు తెలిపారు. 15 శాతం సబ్సిడీ నూలును, 90 శాతం సబ్సిడీతో మగ్గం పనిముట్టు అందజేస్తున్నామని తెలిపారు.

ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆన్ లైన్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేనేత ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు. నేతన్నలకు ఏడాదంతా ఉపాధి కల్పించడంతో పాటు అధిక ఆదాయంతో కూడిన ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇందుకోసం యూనివర్శల్ హెల్త్ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. అనంతరం మంత్రి సవితను చేనేత కుటుంబాలు ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *