సెలవులు ముగియడంతో పోటెత్తిన భక్త బాంధవులు
తిరుమల : భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై ఎక్కువగా దృష్టి సారించారు. శ్రీవారి సేవకులు సేవలలో నిమగ్నం అయ్యారు. ప్రతి రోజూ 80 వేలకు పైగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించు కోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ ఐదు ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వేల లాకర్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గత మూడు రోజుల్లో 1,34,637 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. క్షురకులు భక్తులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. మరో పక్క భక్తులు సేవలో పోటు విభాగం, రవాణా, తదితరులు కూడా తమ విధులను నిరంతరాయంగా అందిస్తున్నారు.






