చంద్రబాబును చూసి గర్వ పడుతున్నా
ప్రశంసలు కురిపించిన అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును చూసి తాను గర్వ పడుతున్నానని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తాను ఒక రైతుగా, పౌరుడిగా ఈ విషయంలో ఆనందంంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి శాఖలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. భూసార పరిరక్షణ, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం వంటి కార్యక్రమాలు గతంలో నిలిచిపోయాయని, ప్రస్తుతం వాటిని పునరుద్ధరించి రైతులకు అందిస్తున్నామని తెలిపారు అచ్చెన్నాయుడు.
వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటోందని, శాస్త్రవేత్తల సూచనలు, ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుందని రైతులకు సూచించారు మంత్రి. గత ఏడాది పొగాకు, కోకో, ఉల్లి, తోతాపురి మామిడి వంటి పంటలకు మార్కెట్ ధరలు తగ్గిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు అందించి రైతులకు తోడ్పాటును అందించిందన్నారు అచ్చెన్నాయుడు. తోతాపురి మామిడి ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా కిలోకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు.