అమరావతి : రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం ఏపీ కూటమి సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన సచివాలయంలో సమీక్ష చేపట్టారు. చట్ట పరమైన అడ్డంకులు అధిగమించడానికి గిరిజన సంఘాల సూచనలు కూడా తీసుకోవాలని సూచించారు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1లోకి మార్చాలని, పోలవరం జిల్లాను జోన్ 2లో చేర్చాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బాక్సైట్ మైనింగ్ విషయంలో గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. గత పాలకులు తమ అవినీతి కారణంగా బాక్సైట్ లీజుల అంశం ఇప్పుడు అంతర్జాతీయ కోర్టులకు వెళ్లిందని గుర్తు చేశారు. గిరిజనుల హక్కులకు, మనోభావాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు ఉండవని….ఈ విషయంలో ఎవరి ట్రాప్ లోనూ పడవద్దని సిఎం సూచించారు. అలాగే 1/70 అమలు విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
ఇదే విషయాన్ని గిరిజన సంఘాలకు చెప్పాలని సిఎం సూచించారు. అరకు కాఫీని ప్రమోట్ చేసినా…గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, రవాణా సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినా అది కూటమి ప్రభుత్వం గిరిజనులపై చూపిన బాధ్యత అన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి అభివృద్ది జరిగినప్పుడే…వారి జీవన ప్రమాణాలు మారినప్పుడే నిజమైన అభివృద్ది అని ప్రభుత్వం నమ్ముతోందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. గిరిజన సంఘాలతో చర్చలకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గిరిజన ప్రజా ప్రతినిధులకు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. సిఎం సూచన మేరకు త్వరలోనే గిరిజన సంఘాలను ఆహ్వానించి చర్చించనున్నారు.






