నల్లగొండ జిల్లా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవతను చాటుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన,నిత్య కూలీ కుమార్తె , ప్రతిభావంతురాలైన విద్యార్థిని పరిమల జర్మనీలోని ఒక ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు సీటు వచ్చింది. ఇందు కోసం తన చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి. తన కొడుకు పేరుతో ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థిని అయిన పరిమల తన కఠోర శ్రమ, విద్యాపరమైన అత్యుత్తమ ప్రతిభతో ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఆమె అంతర్జాతీయ స్థాయి కలలను సాకారం చేసుకోవడంలో ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆమె కుటుంబ పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించి, అత్యవసరమైన ఆ ఆర్థిక సహాయాన్ని అందించారు.
పేదరికం ఎప్పుడూ ప్రతిభకు అడ్డంకి కాకూడదు. సరైన అవకాశం లభిస్తే, వెనుకబడిన వర్గాల విద్యార్థులు కూడా ప్రపంచ వేదికపై అద్భుతాలు సృష్టించగలరు . అర్హులైన విద్యార్థులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి ఆశయాలకు మద్దతునిస్తానని ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. ఇది ఒక కల సాకారానికి అందించిన చేయూత, ప్రతిభకు లభించిన ప్రోత్సాహం, పేదరికం కారణంగా ఏ అర్హత కలిగిన విద్యార్థి కూడా తమ భవిష్యత్తును వదులు కోవాల్సిన పరిస్థితి రాకూడదనే సాయం చేశామన్నారు.





