ఏఈఈ ప‌రీక్ష‌ల కోసం కట్టుదిట్టమైన భద్రత

తిరుప‌తి : ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 23 నుంచి ఏఈఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో 34 పరీక్షా కేంద్రాలతోపాటు మొత్తం 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, చెప్పారు సీఎండీ శివ‌శంక‌ర్ లోతేటి. వీటిలో 81 కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ లోనూ, మరో 13 కేంద్రాలు రాష్ట్రం వెలుపల ఉన్నాయని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నపత్రం లేదా సమాధానాల సమాచారాన్ని అక్రమంగా ప్రసారం చేయకుండా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సమన్వయంతో మొబైల్ జామర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్ల‌డించారు. ప్రశ్నా పత్రాలను ఎన్క్రిప్టెడ్ రూపంలో సర్వర్లకు పంపించి, నిర్ణీత పరీక్ష సమయం ప్రారంభమైనప్పుడు మాత్రమే డీక్రిప్ట్ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రశ్నల క్రమం, సీట్ల కేటాయింపును ర్యాండమైజ్ చేయడం ద్వారా పక్కపక్కన కూర్చున్న అభ్యర్థులకు ఒకే ప్రశ్నల క్రమం, ఒకే ఆప్షన్ల క్రమం రాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థికి ప్రవేశ సమయంలో బయోమెట్రిక్ ధృవీకరణ, ఫింగర్ ప్రింట్/థంబ్ ఇంప్రెషన్, ఫొటో క్యాప్చర్ నిర్వహిస్తారని, ఒరిజినల్ ఫొటో ఐడీని విధి నిర్వహణలో ఉండే శిక్షణ పొందిన సిబ్బంది పరిశీలిస్తారని, అభ్యర్థులందరికీ ఫ్రిస్కింగ్ నిర్వహిస్తారని, మహిళా అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, మహిళా సిబ్బందితోనే తనిఖీలు నిర్వహిస్తారని ఆయన స్ప‌ష్టం చేశారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, వెన్యూ కమాండింగ్ ఆఫీసర్, డిపార్ట్మెంటల్ అబ్జర్వర్లను నియమించామని, నిర్ణీత నిష్పత్తిలో ఇన్విజిలేటర్లను నియమించామని, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ఎస్పీల సమన్వయంతో ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. విద్యుత్ లేదా సాంకేతిక సమస్యల కారణంగా పరీక్షకు అంతరాయం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక విద్యుత్ సరఫరా, డీజీ సెట్లు, యూపీఎస్ బ్యాకప్, ప్రత్యామ్నాయ నెట్వర్క్ కనెక్టివిటీ, అదనపు కంప్యూటర్ వ్యవస్థలు, స్పేర్ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు నమోదు చేసిన సమాధానాలు ఆటోమేటిక్గా సేవ్ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందించామని, దీంతో సాంకేతిక సమస్య తలెత్తినా అప్పటికే నమోదు చేసిన సమాధానాలు కోల్పోకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన బెంచ్ మార్క్ డిజెబిలిటీ (PwBD) అభ్యర్థులకు స్క్రైబ్, అదనపు సమయం వంటి సదుపాయాలు కూడా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. హాల్ టికెట్లను ఆగస్టు 14న‌ అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ apvidyutrecruitment.apcfss.inలో విడుదల చేశామని, అభ్యర్థులు హాల్ టికెట్ లోని అన్ని సూచనలను జాగ్రత్తగా చదివి, గేట్లు మూసివేసే సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు సీఎండీ. అభ్యర్థులు ప్రింటెడ్ హాల్ టికెట్ తోపాటు ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ వంటి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా తమ వెంట తీసుకు రావాల్సి ఉంటుందన్నారు.

సాధారణమైన, తేలికపాటి దుస్తులు ధరించాలని, తక్కువ హీల్స్ ఉన్న స్లిప్పర్లు లేదా చెప్పులు ధరించడం మంచిదని ఆయన సూచించారు. ఫ్రిస్కింగ్, బయోమెట్రిక్ ధృవీకరణ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులు పూర్తిగా సహకరించాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ బ్యాండ్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, కాలిక్యులేటర్లు, కెమెరాలు, పెన్ డ్రైవ్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్/కమ్యూనికేషన్ పరికరాలను తీసుకు రావడాన్ని పూర్తిగా నిషేధించామని, అవి స్విన్ఆఫ్ ఉన్నా కూడా అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. పుస్తకాలు, నోట్స్, లూజ్ పేపర్లు, వాలెట్లు, హ్యాండ్బ్యాగులు, పౌచ్లు తదితరాలను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని, బయోమెట్రిక్ నమోదుకు ఇబ్బంది కలగకుండా అభ్యర్థులు వేళ్లు లేదా అరచేతులపై మెహందీ, హెన్నా, ఇంక్ లేదా ఇతర పదార్థాలు రాసుకోకూడదని ఆయన సూచించారు. ఇంపర్సనేషన్, కాపీయింగ్, ఇతర అభ్యర్థులతో కమ్యూనికేషన్, అనధికారిక మెటీరియల్ వినియోగం వంటి ఏ విధమైన అక్రమాలకు పాల్పడినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని శివ‌శంక‌ర్ లోతేటి హెచ్చరించారు. పరీక్ష అనంతరం కూడా స్పష్టమైన టైడ్లైన్ ప్రకారం నియామక ప్రక్రియ కొనసాగుతుందని, చివరి పరీక్ష జరిగిన తేదీ నుంచి మూడు రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేయాలని నిర్ణయించామని అన్నారు. అనంతరం ఏడు రోజుల పాటు ఆన్లైన్లో అభ్యంతరాలు స్వీకరిస్తారని, వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని, ఫైనల్ ఆన్సర్ కీ, నార్మలైజ్డ్ స్కోర్లు, మెరిట్ జాబితాను సెప్టెంబర్ 2026 చివరి వారంలో విడుదల చేయాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు సిఎండి తెలిపారు.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోటిఫై చేసిన ఖాళీలకు 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారని, తుది ఎంపిక, కేటాయింపు పూర్తిగా మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు, అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుందని అన్నారు. నియామక పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక ప్రకటనలు, అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ ను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని, పుకార్లు, తప్పుడు సమాచారం లేదా అనధికార వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని ఎపిఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి సూచించారు.

  • Related Posts

    మంత్రి నాగేంద్ర రాజీనామాకు బీజేపీ-జేడీఎస్ డిమాండ్

    బెంగ‌ళూరు : భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మంత్రి బి. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షమైన జనతా దళ్ (సెక్యులర్ – జేడీఎస్) బెంగళూరులో నిరసన చేపట్టాయి. బెంగళూరులోని విధాన సౌధ వద్ద,…

    నా టార్గెట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు : కొండా సుష్మిత

    వరంగ‌ల్ జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, కొండా ముర‌ళి కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ కోరింది. ఈ మేర‌కు కొండా సురేఖ‌కు షోకాజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *