ప్రజలకు అందుబాటులో ఉంటేనే భవిష్యత్తు
అమరావతి : టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ప్రజలకకు అందుబాటులో ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని అన్నారు. ఫలానా సమయంలో ఎమ్మెల్యే గారిని కలవచ్చు.. ఆయన అందుబాటులో ఉంటారు అనే విశ్వాసం ప్రజల్లో ఏర్పడితే చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, చిన్నచిన్న సమస్యల కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
టీడీపీకి గ్రామస్థాయి నుంచి బలమైన కార్యకర్తల బలం ఉందని, ఆ బలాన్ని ప్రజా సేవకు ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు. పదవులు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశాలే తప్ప.. అధికారాన్ని చెలాయించడానికి కాదనే విషయాన్ని ప్రతి ప్రజాప్రతినిధి గుర్తుంచుకోవాలి అని అచ్చెన్నాయుడు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కార్యకర్తలను గౌరవించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడమే నాయకత్వానికి అసలైన కొలమానమని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నేతలు, శ్రేణులపై ఉందన్నారు కింజారపు అచ్చెన్నాయుడు.