newsseals.com

స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు పౌల్ట్రీ యూనిట్లు

September 13, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలోని మ‌హిళ‌లు, మహిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు తీపి క‌బురు చెప్పింది. గ్రామీణ మహిళలకు ఉపాధి, అదనపు ఆదాయం కల్పించేందుకు బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ఏటా 2,720 మదర్ పౌల్ట్రీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. SERP, DRDAల ఆధ్వర్యంలో మహిళలకు 30–45 రోజుల శిక్షణ, వ్యాక్సినేషన్, డే-ఓల్డ్ చిక్స్ సరఫరా వంటి సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. పౌల్ట్రీ ఉత్పత్తులకు విలువ జోడించి మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు PPP విధానంలో ఎగ్, చికెన్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలను కేంద్రాలుగా చేసుకుని చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి గతంలో ఉన్న డెవలప్‌మెంట్, బెటర్‌మెంట్ చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించి, మున్సిపాలిటీలు, అర్బన్ అథారిటీల పరిధిలో గ్రామ పంచాయతీలకు సమానమైన తక్కువ ఫీజులతో అనుమతులు పొందేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మొక్కజొన్న ధరల పెరుగుదల కూడా ఒకటని పేర్కొన్న మంత్రి, ఫీడ్ వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నూక బియ్యాన్ని పౌల్ట్రీ ఫారాలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, సంబంధిత శాఖల సమన్వయంతో రాష్ట్ర పౌల్ట్రీ రంగాన్ని దేశంలోనే మరింత అభివృద్ధి చెందిన రంగంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్ప‌ష్టం చేశారు.

Related News