న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర భారతీయ భాషలతో పాటు హిందీ కూడా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. హిందీ దివస్ సందర్భంగా భాషా వైవిధ్యమే భారతదేశ బలమని హోం మంత్రి నొక్కి చెప్పారు. భారతదేశంలోని ఇతర భాషలను గౌరవించి, ప్రోత్సహించి, పరిరక్షించినప్పుడే హిందీ పురోగతికి అర్థం ఉంటుందని అమిత్ షా అన్నారు. ఇతర భారతీయ భాషల గౌరవం, ప్రోత్సాహం, పరిరక్షణను నిర్ధారిస్తూ హిందీ ముందుకు సాగినప్పుడే దాని పురోగతికి ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. హిందీ దివస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం భాషా వైవిధ్యానికి, సాంస్కృతిక శ్రేయస్సుకు నిలయమని, దేశంలోని అనేక భాషలు బలహీనత కాదని, బలమని షా నొక్కిచెప్పారు.
మన భాషలు వైవిధ్య భరితమైనవని అందరూ అంటారని, అదే మన బలహీనత. కానీ మనకు ఇన్ని భాషలు ఉండటమే మన గొప్ప బలం అని నేను నమ్ముతున్నాను అని షా ఒక సందేశంలో అన్నారు. ప్రతి భాష తనతో పాటు ఒక చరిత్రను, జానపద సంప్రదాయాలను, జీవన దృక్పథాన్ని తీసుకు వస్తుందని, యువతరం విలువలను తీర్చిదిద్దడంలో దోహద పడుతుందని ఆయన అన్నారు. మన భాషా వైవిధ్యం భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వ భావనను బలపరుస్తుంది అని ఆయన అన్నారు. భాష అనేది కేవలం భావప్రసార మాధ్యమం మాత్రమే కాదని, అది ఒక సమాజం యొక్క “జ్ఞాపకం” “స్వీయ చైతన్యం” అని షా అన్నారు. సంభాషణ, బంధం , సమన్వయ భాషగా దేశంలోని వివిధ వర్గాలను, కమ్యూనిటీలను అనుసంధానించడంలో హిందీ ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు.





