newsseals.com

వినాయక నిమజ్జనం కోసం హైడ్రా విశిష్ట‌ సేవలు

September 26, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో గ‌ణేష్ నిమ‌జ్జ‌న యాత్ర కొన‌సాగుతోంది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం నగరవాసులు వినాయక నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. కొన్ని విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే పూర్తయినప్పటికీ ప్రధాన నిమజ్జన ఘట్టం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు హైడ్రా అన్ని ఏర్పాట్లు చేసింది. కూకట్‌పల్లి IDL చెరువు వద్ద అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కానప్పటికీ… నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, హైడ్రా ప్రత్యేక చొరవ తీసుకుని చెరువును 25 అడుగుల లోతు వరకు తవ్వించింది. తద్వారా నిమజ్జన ప్రక్రియ సజావుగా, సురక్షితంగా సాగేలా చర్యలు చేపట్టింది.

ఈ ఏర్పాట్లతో పాటు హుస్సేన్‌సాగర్‌తో సహా భారీ స్థాయిలో నిమజ్జనాలు జరిగే ఇతర చెరువుల వద్ద కూడా హైడ్రా ఈతగాళ్లను రంగంలోకి దించింది. హుస్సేన్‌సాగర్ వద్ద మూడు షిఫ్టులలో, ఒక్కో షిఫ్టుకు 50 మంది చొప్పున మొత్తం 150 మంది ఈతగాళ్లను విధుల్లో ఉంచారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో 84 మంది ఈతగాళ్లను విధులకు కేటాయించారు. వీరితో పాటు, 51 DRF బృందాలు కూడా ఈ విధుల్లో నిమగ్నమయ్యాయి. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ, వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా , సురక్షితంగా జరిగేలా హైడ్రా చర్యలు తీసుకుంటోందని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ తెలిపారు.

Related News