newsseals.com

ప్రత్యేక ప్రతిభావంతులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి

September 27, 2026 · VijayaBhaskar

తిరుమ‌ల : ప్రత్యేక ప్రతిభావంతులు తమలోని ప్రతిభను గుర్తించి, నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకుని ఆత్మ విశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పాత అన్నప్రసాద భవనంలో ప్రపంచ బధిరుల దినోత్సవం, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆనందరాజు మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులకు సమాజంలో సముచిత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ ప్రతిభను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. టీటీడీ యాజమాన్యం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

ఎస్వీ బధిరుల ఉన్నత పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్య, ఉద్యోగం, క్రీడలు, కళలు తదితర రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన ఐదుగురు ప్రత్యేక ప్రతిభావంతులైన టీటీడీ ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. సంకేత భాష A–Z పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకు ముందు టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం నుంచి సమావేశ మందిరం వరకు ప్రత్యేక ప్రతిభావంతులు ర్యాలీ నిర్వహించారు.

Related News