తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు సంఖ్య పెరుగుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. అయినా ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహ రించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ జెబుతున్నాడు. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి , శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.