newsseals.com

రెడ్డి, రావు జాయేగా బీసీ సీఎం ఆయేగా : తీన్మార్ మ‌ల్ల‌న్న‌

September 27, 2026 · VijayaBhaskar

వికారాబాద్ జిల్లా : తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర కొడంగల్‌కు చేరుకుంది. గోల్కొండ ఖిల్లా నుంచి దాదాపు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న మల్లన్న కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. “రెడ్డి, రావు జాయేగా… బీసీ సీఎం ఆయేగా”, “ఓట్ హమారా… రాజ్ తుమారా… నై చలేగా” అంటూ మల్లన్న నినదించారు. గోల్కొండ ఖిల్లా నుంచి ప్రారంభించిన బీసీ రాజ్యాధికార యాత్ర దాదాపు 250 కిలోమీటర్లు పూర్తి చేసుకొని కొడంగల్ గడ్డకు చేరుకుందని తీన్మార్ మల్లన్న తెలిపారు. ఈ పాదయాత్ర వ్యక్తిగత పదవుల కోసం కాదని, తరతరాలుగా రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా సాధించడం కోసమేనని పేర్కొన్నారు.

“మన ఓట్లు మనం వేసుకోవాలి… మన రాజ్యాన్ని మనమే ఏలుకోవాలి. మన జనాభాకు తగ్గ రాజకీయ వాటా మనకు రావాలి. అందుకోసమే గోల్కొండ నుంచి అడుగు మొదలుపెట్టాం. ఆ అడుగు ఇప్పుడు కొడంగల్ గడ్డకు చేరుకుంది అని మల్లన్న పేర్కొన్నారు. 2014 తర్వాత తెలంగాణలో బలమైన ప్రతిపక్ష గొంతు వినిపించని సమయంలో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తాను పోరాడానని మల్లన్న చెప్పారు. తనపై మూడుసార్లు హత్యకు కుట్రలు జరిగాయని, తన కార్యాలయాలను ధ్వంసం చేశారని, చంచల్‌గూడ, చెర్లపల్లి జైళ్లలో వందల రోజుల పాటు బంధించారని ఆయన అన్నారు. అప్పుడు నేను వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కూడా తగ్గను. బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు అని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో బీసీల జనాభా సుమారు రెండు కోట్లు ఉంటే, ప్రస్తుత ప్రభుత్వ కులగణనలో దాన్ని 1.80 కోట్లకు తగ్గించారని ఆరోపించారు. 20 లక్షల మంది బీసీలను తగ్గించి 7 లక్షల మంది రెడ్లను రేవంత్ రెడ్డి పుట్టించాడని అన్నారు .కులగణన లెక్కలపై అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీశానని, తాను తప్పుగా భావించిన ఆ లెక్కల పత్రాలను తగలబెట్టినట్లు చెప్పారు. ఆ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును కూడా తగలబెట్టానని పేర్కొన్నారు. అనంతరం బీసీల కోసం మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదని తనను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

Related News