అప్పలాయగుంట ఆలయానికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు’
తిరుపతి : మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది. తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా గాంధీ జయంతి సందర్భంగా ఆలయాలు, ధార్మిక సంస్థల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణను ప్రోత్సహించే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రదానం చేస్తోంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయ సూపరింటెండెంట్ శ్రీవాణికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026 మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈఓ) ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో డాక్టర్ ఎ. శరత్ అభినందించారు ఆలయ సూపరింటెండెంట్, సిబ్బందిని.