హైదరాబాద్ : ఓటర్ల జాబితా సవరణ (సర్ )లో తప్పుడు దరఖాస్తులపై తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఫారం 6, 7 లేదా 8లలో తప్పుడు వివరాలు సమర్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి హెచ్చరించారు. ఫారం 7 ద్వారా సమర్పించిన భారీ సంఖ్యలో ఉన్న దరఖాస్తులలో కొన్ని నిజమైనవి కాకపోవచ్చన్న ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల సంఘం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది.
తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950’లోని సెక్షన్ 31 కింద చర్యలు తీసుకోవడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ (GHMC) కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎటువంటి చర్య తీసుకునే ముందైనా ‘రూల్ 20’ ప్రకారం విచారణ జరపాలని కూడా సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో వైపు ఎంఐఎంతో పాటు ఇతర పార్టీల నేతలు ఓటర్ల జాబితా, సవరణపై తీవ్ర స్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సీఈఓ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.





