బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇక నుంచి 6వ తరగతి నుండే ఏఐపై శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు సీఎం డీకే శివకుమార్. పాఠశాలల్లో ఏఐ శిక్షణను అందించడానికి గూగుల్ ఆసక్తి చూపిందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సమాచార సాంకేతిక శాఖ , ప్రైవేట్ భాగస్వాముల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణను ప్రవేశపెట్టే మార్గాలను అన్వేషించాలని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధికారులను ఆదేశించారు. తన ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమాలు, నియామకాలు, ప్రాధాన్యత పథకాల పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 9వ తరగతి విద్యార్థులకు ఏఐ శిక్షణ ప్రారంభమైందని, దీనిని 6వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించే దిశగా కృషి చేయాలని శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఏఐ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని కూడా అధికారులను ఆదేశించారు. 956 మంది ఉపాధ్యాయులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పనితీరును సమీక్షిస్తూ 941 పట్టణ పాఠశాలలకు చెందిన 9వ, 11వ తరగతి విద్యార్థులను ప్రగతిశీల రైతుల పొలాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులు రాత్రిపూట గ్రామాల్లో బస చేయడానికి కమ్యూనిటీ హాళ్లు, హాస్టళ్లు వంటి వసతులు కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం డిసెంబర్ నాటికి పూర్తవ్వాలని అన్నారు.
కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ అభివృద్ధిలో భాగంగా నవంబర్ 14 నాటికి శంకుస్థాపనలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని శివకుమార్ ఆదేశించారు. కేపీఎస్ కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు , టెండర్లను ఆమోదించే అధికారాన్ని డిప్యూటీ కమిషనర్లకు కల్పించడం ద్వారా అమలు ప్రక్రియను సరళీకృతం చేశామని ఆయన తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా మరో 100 కేపీఎస్ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు 60 పాఠశాలల అభివృద్ధికి ఆసక్తి చూపాయని వెల్లడించారు.





