అమరావతి : వైసీపీ, సీపీఎం పార్టీలకు చెందిన కీలక నేతలు బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు శాలువాలు కప్పి బుధవారం జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, విద్యాసంస్థల నిర్వాహకులు, వ్యాపారవేత్తలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో YCP నాయకులు మధుసూదన్, జ్యోతి, అల్లూరి శంకర్, మర్రి బెంజమిన్, CPM నాయకులు కొంపెల్ల భాను లక్ష్మీనారాయణ, అలాగే పలు విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, సామాజిక కార్యకర్తలు , వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలు , గన్నవరం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు జనసేనలో చేరారు. వీరితో పాటు సుమారు 300 మంది జనసేన పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి .
ఈసందర్బంగా నాగబాబు మాట్లాడారు. పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలను తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకుంటారని చెప్పారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందన్నారు. ఆ గుర్తింపు కాస్త ఆలస్యంగానో లేదా త్వరగానో రావచ్చు అని అన్నారు. నాతో సహా ఈ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికీ అదే విధంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు నాగబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తన చేతుల మీదుగా జన సైనికులకు ఆటోలు, స్వయం ఉపాధి సాధనాలు పంపిణీ చేసారు.





