హైదరాబాద్ : తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానం కావాలని అన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ మొదటి పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ పెట్టుబడి వ్యవస్థను బలోపేతం చేయడానికి, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి ,ప్రపంచ పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఒక ప్రముఖ గమ్యస్థానంగా నిలపడానికి ఉద్దేశించిన కీలక వ్యూహాలు, కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించారు.
తెలంగాణ రైజింగ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సమర్థవంతమైన సమన్వయం, సకాలంలో అమలు ,పెట్టుబడిదారులకు అనుకూలమైన పటిష్టమైన వ్యవస్థను నిర్ధారించాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేపడతామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు సంజయ్ జాజు.





