అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారులను బలోపేతం చేసేందుకు పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల కింద 9 వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించగా, మరో 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల మంజూరు చేశాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా మరో 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశాం. వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకలు సులభతరం చేసేందుకు 161 డొంక రోడ్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, రైతులు, విద్యార్థులు, స్థానిక ప్రజల ప్రయాణ ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అని అన్నారు పవన్ కళ్యాణ్.
వీర్లగుడిపాడు వంతెన నిర్మాణానికి చర్యలు వేగవంతం చేశామన్నారు. సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో వంతెన నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కోరగా, ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు, అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా, తాగునీటి సమస్యను ప్రస్తావించగా.. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద ఇప్పటికే రూ.72 కోట్లతో 391 సింగిల్ విలేజ్ స్కీమ్స్‌ను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.




