ముంబై : బీజేపీ ఎంపీ, ప్రముఖ వివాదాస్పద నటి కంగనా రనౌత్ సంచలనంగా మారారు. కంగనా తదుపరి చిత్రం ‘భయానక’ మలుపు తీసుకుంటోంది . ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’ ‘చంద్రముఖి 2’ చిత్రాలలో నటించిన తర్వాత ఈ ప్రకటనతో ఈ నటి తిరిగి హారర్ జానర్‌లోకి అడుగు పెడుతోంది. తెలుగు చిత్ర నిర్మాత రవిబాబు దర్శకత్వం వహించనున్న ‘స్క్యారీ పిక్చర్’ అనే రాబోయే హారర్ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించనుంది. నటుడు-నిర్మాత రానా దగ్గుబాటి హలోవీన్ రోజున న్యూఢిల్లీలో జరిగిన హారర్‌కాన్ ఇండియా 2026లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి, వీరిద్దరి మధ్య కొత్త కలయికను వెల్లడించారు. ఈ చిత్రంతో రవిబాబు దర్శకుడిగా హిందీ చిత్రసీమలోకి అడుగు పెడుతున్నారు.
ఆయన గతంలో థ్రిల్లర్ , హారర్ అంశాలను అన్వేషించిన ‘అనసూయ’ ‘అవును’ వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కథాంశం , నటీనటులు పోషించే పాత్రల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా కంగనా కథానాయికగా నటిస్తున్నారు. ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’ (2009) , ‘చంద్రముఖి 2’ (2023) చిత్రాల తర్వాత ఈ ప్రకటనతో ఈ నటి మళ్లీ హారర్ జానర్‌లోకి అడుగు పెడుతున్నారు కంగనా రనౌత్. చిత్ర బృందం మిగిలిన నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ లేదా విడుదల ప్రణాళికలను ఇంకా ప్రకటించలేదు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు కంగనా రనౌత్.




