Monday, 2 November 2026

దియా మీర్జాపై రామ్ దాస్ అథ‌వాలే షాకింగ్ కామెంట్స్

newsseals-DiaaMirza

ముంబై : పర్యావరణ పరిరక్షణ పేరుతో హిందూ పండుగలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ బీఎంసీ పర్యావరణ అనుకూల దీపావళి ప్రచారం కోసం నటి దియా మీర్జా చేసిన వీడియోపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే , మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సోమవారం విమర్శించారు. కాలుష్య రహిత పండుగలను ప్రోత్సహిస్తూ మీర్జా చేసిన వీడియో బీజేపీ ముంబై చీఫ్ అమీత్ సతమ్ అభ్యంతరాల తర్వాత బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి ఆమె క్లిప్‌ను తొలగించడంతో వివాదాస్పదమైంది. ఆదివారం మీర్జా క్లిప్‌ను తొలగించినప్పటికీ నటీమణులు మాధురీ దీక్షిత్, నిషిగంధ వాడ్, అలాగే క్రికెటర్ అజింక్య రహానే నటించిన ప్రచార వీడియోలను బీఎంసీ ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో అలాగే ఉంచారు. దీపావళి, హోలీ వంటి హిందూ పండుగల వేడుకల వల్ల మాత్రమే పర్యావరణ నష్టం జరుగుతుందా అని రాణే ప్రశ్నించారు. ఇతర మత పరమైన సందర్భాలలో ఇలాంటి ఆందోళనలు వ్యక్తం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

మొహర్రం లేదా ఈద్ సమయంలో జంతువులకు హాని జరిగినప్పుడు ఎటువంటి ఆందోళనలు వ్యక్తం చేయరు. రంజాన్ సమయంలో, మురికి అంతటా వ్యాపిస్తుంది, కానీ ఎవరూ ఏమీ అనరు. పర్యావరణ పరిరక్షణ గురించి మనకు ఉపన్యాసాలు ఇవ్వడానికి వారు కేవలం హిందూ పండుగలను మాత్రమే వెతుకుతారు అని ఆయన వ్యాఖ్యానించారు. మీర్జా వంటి వారిని ఇలాంటి సూచనలు చేయడానికి బీఎంసీ ప్రోత్సహిస్తుంటే, తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ప్రస్తావిస్తానని కూడా ఆ బీజేపీ మంత్రి అన్నారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ముంబై బీజేపీ చీఫ్ సతమ్ ఒక పోస్ట్‌లో మీర్జా క్లిప్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని గంటల తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ ఆ క్లిప్‌ను తొలగించింది.

దీపావళిని ఎలా జరుపుకోవాలో మాకు మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మా సంప్రదాయాలు మా సంస్కృతిలో లోతుగా పాతుకు పోయాయి అని ఆ బీజేపీ నాయకుడు రాశారు. మీర్జా వీడియోతో పాటు బీఎంసీ పెట్టిన పోస్ట్‌లో బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం బహిరంగ రహదారులు, వీధులు , ఫుట్‌పాత్‌లపై బాణసంచా కాల్చడం ఖచ్చితంగా నిషేధించ బడింది అని పేర్కొంది. కేంద్ర మంత్రి అథవాలే మాట్లాడుతూ బాణసంచా లేకుండా దీపావళి వేడుకలు వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయని, అలాగే కాలుష్యాన్ని కూడా నివారించాలని నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *