అమరావతి : మురాసు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది అటు తమిళనాడుతో పాటు ఇటు ఏపీని. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. వీరికి తోడుగా ఉండేందుకు తమిళనాడు టీవీకే సర్కార్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. ఈ సందర్బంగా సీఎం విజయ్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలకు బయలు దేరాయి. అరక్కోణం సమీపంలోని 4వ బెటాలియన్ నుండి 90 మంది సిబ్బందితో కూడిన మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపారు. ‘మురాసు’ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడ విపత్తు నిర్వహణ చర్యలకు మద్దతుగా ఈ బృందాలను తరలించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బృందంలో 30 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను ఈ రాత్రికి లేదా రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తమిళనాడు ప్రభుత్వం 500 మంది విద్యుత్ శాఖ సిబ్బందిని, అవసరమైన పరికరాలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు పంపింది. సీనియర్ కమాండర్ నేతృత్వంలోని ఈ బృందాలు అత్యవసర సహాయక చర్యలు చేపట్టడం, శిథిలాలను తొలగించడం , బాధితులకు ఉపశమనం కల్పించే పనుల్లో నిమగ్నం కానున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, తీవ్ర తుపానుగా మారిన ‘మురాసు’ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా 120 కి.మీ, కావలికి తూర్పు-ఆగ్నేయంగా 140 కి.మీ, చెన్నైకి ఈశాన్యంగా 170 కి.మీ, ఒంగోలుకు ఆగ్నేయంగా 180 కి.మీ మరియు మచిలీపట్నానికి దక్షిణంగా 220 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.




