Monday, 2 November 2026

ఆరు నెలల్లో 12వ పీఆర్సీ నివేదిక సమర్పించాలి

newsseals-PRC

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పీఆర్సీ కమిషనర్ దినేష్ కుమార్ కు విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో పీఆర్సీ కమిషనర్‌ను ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తదితర నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీ నియామకంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, దీనివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం కమిషన్‌కు ఏడాది గడువు ఇచ్చినప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని వినియోగించుకుని ఆరు నెలల్లోనే నివేదిక సిద్ధం చేయవచ్చని తెలిపారు.

పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం, గృహ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తక్కువ పెన్షన్లతో పెన్షనర్లు, చాలీచాలని వేతనాలతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించక పోవడం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత ప్రభావితం చేస్తోందన్నారు. 12వ పీఆర్సీ అమలులో జాప్యం జరిగితే 2022 నుంచి ప్రతి సంవత్సరం పదివేలకు పైగా పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పీఆర్సీ అనేది కేవలం వేతనాల పెంపునకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఉద్యోగుల ఆర్థిక భద్రత, కుటుంబ సంక్షేమం, ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను త్వరితగతిన సేకరించి, అవసరమైన సమాచారాన్ని డిజిటల్ విధానంలో విశ్లేషించి, నిర్ణీత గడువు కంటే ముందుగానే నివేదికను ప్రభుత్వానికి అందించాలని కమిషనర్‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *