బెంగళూరు : రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పరోక్షంగా కేంద్ర మంత్రి , మాజీ సీఎం కుమార స్వామిని లక్ష్యంగా చేసుకుని ఫైర్ అయ్యారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. మా మంత్రులపై దాడులు చేయమని మోదీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఒత్తిడి చేస్తున్నారని బాంబు పేల్చారు. ఈ సందర్బంగా ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ ఆయన ఆరోపణ బీజేపీ సంకీర్ణ భాగస్వామి, జేడీఎస్ అగ్ర నాయకుడు , కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామిని ఉద్దేశించినట్లుగా కనిపిస్తోంది. తనపైనా, తన కేబినెట్ సహచరులపైనా ఐటీ, ఈడీ చర్యలు తీసుకోవాలని ఒక కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ఆ కేంద్ర మంత్రి పేరు చెప్పకుండా, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విచారణను, తనపైనా , ఇతర రాష్ట్ర మంత్రులపైనా చర్యలు కోరేందుకు ఆ మాజీ మంత్రి ఒక “రాజకీయ కవచం”గా వాడుకుంటున్నారని ఆయన అన్నారు.
కేపీఎస్సీ విచారణను రాజకీయ కవచంగా వాడుకుంటూ, నా కేబినెట్ సహచరులకు, నాకు వ్యతిరేకంగా ఐటీ, ఈడీలను ఆయుధాలుగా ఉపయోగించమని ఒక కేంద్ర మంత్రి మోదీ సర్కార్‌పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని ఢిల్లీ అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అని, ఆ విషయం తనకు తెలిసిందన్నారు ప్రియాంక్ ఖర్గే. కేపీఎస్సీ నియామకాల కేసులో కాంగ్రెస్ నాయకులను, నన్ను తప్పుగా ఇరికించమని నిందితులందరిపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ గ్రూప్ డి కొత్త సభ్యుడు ఈడీని ఉపయోగించు కోవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇదిలా ఉండగా ప్రియాంక్ ఖర్గే ఆరోపణలు బీజేపీ సంకీర్ణ భాగస్వామి అయిన జేడీ (ఎస్) అగ్ర నాయకుడు, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని ఉద్దేశించినట్లుగానే ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.




