లక్ష్య సాధనలో డీప్‌టెక్ ఆవిష్కరణలు కీలకం
హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఫిక్కీ ( FICCI ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకు పోతోందని చెప్పారు. ప్రధానంగా టెక్నాలజీ పరంగా టాప్ లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఫిక్కీ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదన్నారు మల్లు భట్టి విక్రమార్క. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా డీప్‌టెక్ లీడర్‌షిప్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా, అంతకు మించి గర్వంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం 2034-35 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. ఈ లక్ష్య సాధనలో డీప్‌టెక్ ఆవిష్కరణలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పారు. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేసినప్పుడే సాంకేతిక ఆవిష్కరణలు సామాన్య ప్రజలు, రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చే ఉత్పత్తులుగా మారతాయని అన్నారు. శాస్త్ర సాంకేతిక ఫలాలు యువతకు ఉపాధి కల్పించడంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు మల్లు భట్టి విక్రమార్క.