హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ నెలలో హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ -2026ను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ సందర్బంగా స్కిల్ యూనివర్సిటీలో త్వరలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. యూనివర్సిటీ ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతమయ్యేలా సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశించారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి.దేశ విదేశాల నుండి వచ్చే ప్రముఖులు, ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చూడాలన్నారు. అంతే కాకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు.




