హైదరాబాద్ : నవంబర్ నెలలో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రహదారుల పనులు, హామ్ రోడ్లు, ఉస్మానియా, నిమ్స్ విస్తరణ, నూతన హైకోర్టు భవన నిర్మాణాల పురోగతిని పరిశీలించారు..ఆల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ఏడాదిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అలాగే ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) సదస్సు ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష చేపట్టారు. ఈ సదస్సుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో పాటు సీఎం ఎ. రేవంత్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వీరి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సును తెలంగాణ అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడుల అవకాశాలను చాటేలా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుతో పాటు డిసెంబర్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు దీన్ని ఒక వేదికగా మలచి, రాష్ట్ర సమగ్ర ప్రగతికి బాటలు వేసేలా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.




