అమరావతి : మురసు తుపాను ప్రభావం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తుపాను తీవ్రతపై మంగళవారం సచివాలయంలో ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తదనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారుల కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్నారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడడం ప్రధమ ప్రాధాన్యంగా ఉండాలన్నారు. ప్రజలు తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు సీఎం. చివరి వ్యక్తికీ సహాయం అందే వరకు యంత్రాంగం విశ్రమించ వద్దు అని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సిబ్బంది, యంత్రాంగం తక్షణ స్పందనతో తుఫాను బాధితుల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఒంగోలు-బాపట్లకు సమీపంలో 120 కి.మీ. వేగంతో తుఫాన్ పయనిస్తోందని సీఎంకు వెల్లడించిన అధికారులు. ఒంగోలులో పలుచోట్ల పడిపోయిన చెట్లను వెంటనే క్లియర్ చేసినట్టు తెలిపారు జిల్లా కలెక్టర్. నెల్లూరు జిల్లాలో వ్యవసాయ భూముల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టి పంటలు దెబ్బతినకుండా చూస్తున్నామని తెలిపారు ఆ జిల్లా కలెక్టర్. పల్నాడు, మార్కాపురం, గుంటూరు జిల్లాలో పలుచోట్ల నిలిచి పోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు.
ఈరోజు రాత్రికి తుఫాన్ తీవ్రత పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు సీఎం. ప్రకాశం, బాపట్లలో వర్షపాతం మరింత పెరిగిందని, వచ్చే 4 నుంచి 5 గంటలు కీలకం అని అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.




