కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు డెడ్ లైన్
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు డిసెంబర్ గడువు విధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు , నీటిపారుదల శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. దెబ్బతిన్న మూడు బ్యారేజీలను పునరుద్ధరించి, తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ భద్రతా నిపుణుల సిఫార్సులకు అనుగుణంగానే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పనులు డిసెంబర్లో ప్రారంభం కావాలని పునరుద్ధరణకు అవసరమైన తుది అనుమతులను నవంబర్ నెలాఖరులోగా పొందాలని ఆయన సూచించారు. మేడిగడ్డ వద్ద అందుబాటులో ఉన్న నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదనే అంశంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీల నుండి నీటిని ఎత్తిపోయడం సాంకేతికంగా సాధ్యం కాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు స్పష్టం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ మేడిగడ్డ నుండి ఎత్తిపోసిన నీరు ఎల్లంపల్లికి చేరాలంటే అన్నారం , సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నిర్మాణ పరమైన లోపాలు ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను తెరిచి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇప్పటికే హెచ్చరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ కోసం సుమారు రూ. 4,193 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణ పరమైన లోపాలకు సంబంధించిన మరమ్మతు ఖర్చులను సంబంధిత నిర్మాణ సంస్థలే భరించాలని, మిగిలిన అదనపు పనులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని ప్రతిపాదించారు.