newsseals.com

డిసెంబ‌ర్ లో కాల భైరవ, కావ్య కళ్యాణ్‌రామ్ వివాహం

November 6, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి కుమారుడు గాయకుడు కాల భైరవ, నటి కావ్య కళ్యాణ్‌రామ్‌ను వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్నారు. వధువు ఇంట్లో ఇప్పటికే వివాహ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. కావ్య తండ్రి ఇటీవల సోషల్ మీడియాలో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను పంచుకోగా, అవి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. కీరవాణి పెద్ద కుమారుడైన కాల భైరవ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కథానాయికగా ఎదిగిన కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఆయన ప్రేమలో పడ్డారు.

కుటుంబ సభ్యుల అంగీకారం లభించాక, ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 31న తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో వీరి నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. వచ్చే నెలలో వివాహం జరగనుండటంతో కావ్య కుటుంబ సభ్యుల ఇంట్లో వేడుకలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి కీరవాణి కుటుంబ సభ్యులు హాజరై కావ్య, కాల భైరవలను ఆశీర్వదించారు. ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి , ఆయన భార్య రమా రాజమౌళి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ‌రో వైపు నటుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయిని నిశ్చితార్థం చేసుకున్నారు. అలాగే యువ నటుడు తేజ సజ్జ కూడా వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

Related News