ముంబై : మనీష్ తివారి దర్శకత్వం వహించిన చిత్రం రామాయణం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ వసూళ్లను రాబడుతోంది. దృశ్య పరంగా ప్రజలను ఆకట్టుకుంటోంది. కథ పరంగా అద్భుతంగా చిత్రీకరించడం పట్ల సర్వత్రా చర్చకు దారి తీసింది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినట్టు టాక్. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ‘రామాయణం’ చిత్రాన్ని థియేటర్లలో రికార్డ్ చేసి ఆన్లైన్లో షేర్ చేసేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చిత్ర నిర్మాతలు హెచ్చరించారు. బాంబే హైకోర్టు ఉత్తర్వులను ఉటంకిస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనధికారిక క్లిప్‌లను తొలగించాలని కోరారు.
“థియేటర్లలో ‘నమిత్ మల్హోత్రా రామాయణం’ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను అనధికారికంగా రికార్డ్ చేసి సోషల్ మీడియా ,ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది అని వారు ఆ మైక్రో-బ్లాగింగ్ సైట్లో రాసుకొచ్చారు. బాంబే హైకోర్టు జారీ చేసిన ఇటీవలి ఉత్తర్వులను ప్రస్తావించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే ‘నేరపరమైన సివిల్, కోర్టు ధిక్కార’ చర్యలు తీసుకుంటామని నిర్మాతలు స్పష్టం చేశారు . వాణిజ్య మేధో సంపత్తి దావా నంబర్ 37230/2026లో బాంబే హైకోర్టు నవంబర్ 2, 6వ తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎవరూ కూడా ఈ చిత్రాన్ని లేదా అందులోని కొంత భాగాన్ని అనుమతి లేకుండా రికార్డ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి లేదా ప్రసారం చేయడానికి వీలు లేదు. ఇలా చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని నిర్మాతలు వెల్లడించారు.




