అమరావతి : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ రాష్ట్రానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సంస్థ సామాజిక బాధ్యత నిధుల కింద 750 ఐబ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాలను వైద్యారోగ్య శాఖకు అందించేందుకు అంగీకరించిందని వెల్లడించారు. ఒక్కో పరికరం విలువ సుమారు రూ.7.5 లక్షలు. మొత్తం 750 పరికరాల వ్యయం సుమారు రూ.56 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుందని తెలిపారు. ఈ మేరకు బీపీసీఎల్‌తో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఒప్పందం చేసుకున్నారు. బీపీసీఎల్ నిధులతో హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రా టెక్ లిమిటెడ్ (హైట్స్) పరికరాలను కొనుగోలు చేసి వైద్యారోగ్య శాఖకు అందిస్తోంది.
ఇప్పటికే తొలి విడతగా 375 పరికరాలను అందించగా, వాటిని 13 జిల్లాలకు పంపిణీ చేశారు. ఆయా జిల్లాల్లో మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో ఐబ్రెస్ట్ ఎగ్జామ్ పరికరాల పంపిణీని రెండు విడతల్లో చేపడుతున్నారు. తొలి విడతలో 375 పరికరాలను పంపిణీ చేయగా, రెండో విడతలో మిగిలిన 375 పరికరాలను ఇతర జిల్లాలకు పంపిస్తారు. ఆయా జిల్లాల్లోని గ్రామాల జనాభా ఆధారంగా మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు పరికరాలను కేటాయిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. ఈ పరికరాల ద్వారా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మంది మహిళలకు వయసు ప్రామాణికంగా చేసుకొని పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు.




