అమరావతి : ధరలను అదుపులోకి తెచ్చేందుకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేందుకు ఖర్చు అవుతుందనే ఆలోచన వద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రస్తుతం నెలకు రూ.100 కోట్లు వరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రభుత్వం ఖర్చు పెడుతోన్న విషయాన్ని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో బియ్యం నిల్వలు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హోల్ సేల్ డీలర్లు కావచ్చు… మిల్లర్లు కావచ్చు… ఎవరి వద్ద ఎంత మేర బియ్యం నిల్వలు ఉన్నాయనే అంశంపై అధికార యంత్రాంగానికి స్పష్టత ఉండాలన్నారు. ధరల నియంత్రణ విషయంలో నిరంతరం మార్కెట్ వాచ్, అగ్రీ వాచ్ చేస్తూ… వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
నిత్యావసరాలతో పాటు… కూరగాయల ధరలు కూడా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు రైతు బజార్లు కీలకంగా వ్యవరించాలన్నారు. అలాగే ధరల నియంత్రణపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందులో విజిలెన్స్ నిఘా పెంచాలని సమీక్షలో వర్చువల్ గా పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోరహర్ , సీఎస్ సాయి ప్రసాద్ సహా పౌర సరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




