భక్తుల ప్రశ్నలకు సింఘాల్ సమాధానం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు సంబంధించి ప్రతి నెలా నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని పేర్కొంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు భక్తుల 0877-2263261లో సంప్రదించాలని కోరింది. ఇదిలా ఉండగా టీటీడీ గత కొన్నేళ్లుగా ఈ అరుదైన డయల్ యువర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. భక్తులు చెప్పే ప్రతి మాటను, ఇచ్చే సూచనలను తీసుకునేందుకు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.






