వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. తిరుమల పుణ్య క్షేత్రంలో వచ్చే మే నెలకు సంబంధించి నిర్వహించే పర్వదినాల వివరాలు వెల్లడించింది. ఇందులో భాగంగా మే 1వ తేదీన కూర్మ జయంతి, పౌర్ణమి గరుడసేవ ఉంటుందని తెలిపింది. 2వ తేదీన తాళ్లపాక అన్నమాచార్య జయంతి నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. మే 3న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం , 12వ తేదీన హనుమంతుని జయంతి, 21న నమ్మళ్వార్ ఉత్సవారంభం ఉంటుందని వెల్లడించింది టీటీడీ.
ఇదే క్రమంలో మే 26న వరదరాజ స్వామి వర్ష తిరు నక్షత్రం, 30న నమ్మళ్వార్ శాత్తుమొర నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా వేసవి కాలం కావడం, సెలవులు ప్రకటించడంతో భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని ఈవో రవిచంద్ర వెల్లడించారు. ఇందులో భాగంగా మే1 నుంచి వచ్చే జూలై 15వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు మెరుగైన, సౌకర్యవంతంగా దర్శన భాగ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు సహకరించాలని కోరారు ఈవో.





