
కేఎల్ రాహుల్, జడేజా, ధ్రువ్ జురైల్ సెంచరీలు
అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. కేవలం 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది. ఇంకా ఆట ఆడేందుకు మూడు రోజుల సమయం ఉంది. ఇండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభమన్ గిల్ 50 పరుగులకే అవుట్ కాగా కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్ , రవీంద్ర జడేజాలు ఉతికి ఆరేశారు. శతకాలతో హోరెత్తించారు. తమకు ఎదురే లేదని చాటారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 162 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ దూకుడు ప్రదర్శించింది. కేఎల్ రాహుల్ తన కెరీర్ లో 11వ సెంచరీ నమోదు చేశాడు. ఇక జురేల్ తన టెస్టు క్రికెట్ లో మెయిడెన్ శతకంతో మెరిశాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన రవీంద్ర జడేజా సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో పరుగుల వరద పారింది మైదానంలో.
వెస్టిండీస్ బౌలర్లు ఎంతగా ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టీమిండియా తన రెండో రోజు ఆట ముగిసే సమయానికి ప్రత్యర్థి జట్టుపై 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ 197 బంతుల్లో 100 చేస్తే జురైల్ 210 బాల్స్ లలో 125 రన్స్ చేశాడు. జడేజా 178 బంతులు ఎదుర్కొని 104 పరుగులతో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమ్్ ఇండియా 128 ఓవర్లు ఆడింది. సగటున ఓవర్ కు 3.50 రన్స్ చేసింది. భారత ఇన్నింగ్స్ లో 45 బౌండరీలు , 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 2016 తర్వాత సెంచరీ చేయడం విశేషం.